అన్నమయ్యతో ఊహించని విజయాన్నందుకున్న నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి.. అదే కోవలో శ్రీరామదాసును తెచ్చి, మరో విజయాన్నందుకున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన మరో ఆధ్యాత్మిక చిత్రం ‘షిరిడి సాయి’. తొలి రెండు సినిమాలైతే మనకు కొంచెం కొత్తే. దీనికి తోడు దర్శకేంద్రుడు.. తనదైన గ్లామర్, ఎంటర్టైన్మెంట్ టచ్ ఇచ్చి.. ఆ సినిమాల్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్దారు. ఐతే తాజా చిత్రం మాత్రం ఆ రెండింటికీ భిన్నమైంది. అక్కడ భక్తుడు ప్రధాన పాత్రధారి అయతే ఇక్కడ దైవానిది ముఖ్య పాత్ర. కాబట్టి మసాలాలు అద్దే అవకాశం లేదు. అందులోనూ ఇది అందరికీ తెలిసిన కథ. ఇప్పటికే సాయి నేపథ్యంలో సినిమాలు కూడా వచ్చాయి. ఇన్ని పరిమితుల మధ్య తయారైన ‘షిరిడి సాయి’ ప్రేక్షకుల్ని మెప్పించిందా..? చూద్దాం!
కథ గురించి చెప్పాల్సిన కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ తెలిసిందే. సాయి పుట్టుక నుంచి మరణం వరకు ఆయన జీవితాన్ని చూపించారు. ఇలాంటి సినిమా తీయాలన్న ప్రయత్నం మెచ్చదగిందే. ఐతే పైన చెప్పుకున్న పరిమితుల మధ్య ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దితే తప్ప ప్రేక్షకులకు ఎక్కదు. ఈ విషయంలో చిత్ర బృందం కొంతమేరకు విజయవంతమైంది. సినిమా ప్రథమార్ధంలో బాబా మహిమల మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. ద్వితీయార్ధంలో సాయితత్వాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు. ఐతే అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలో విభిన్నమైన సన్నివేశాలు చూపించడానికి ఇందులో ఎక్కువ అవకాశం లేకపోయింది. భక్తి విషయాన్ని పక్కనబెడితే.. సాయి తత్వాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో రాఘవేంద్రరావు సఫలమయ్యారు. టైటిల్స్ సమయంలో సాయి జన్మ వృత్తాంతాన్ని బొమ్మల రూపంలో చెప్పడం.. ఆ సందర్భంగా వచ్చే పాట ఆకట్టుకుంటాయి. గతలో వచ్చిన సాయి సినిమాలకు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు చేశారు. శ్రీహరి పాత్ర ఆ ఉద్దేశంతో తెచ్చిందే. ఐతే ఆ పాత్ర పండలేదు. శ్రీహరి ఏమాత్రం ఆ పాత్రకు సూటవలేదు. ఆరంభంలో ఆంగ్లంలో డైలాగులు చెప్పే శ్రీహరి పాత్ర.. చివర్లో స్లాంగ్ కూడా మార్చకుండా అచ్చతెలుగులో మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. షాయాజి షిండే పాత్రను విలన్ లా ప్రొజెక్ట్ చేయాలని చూశారు కానీ.. అతనికి ఏదో ఒక దశలో జ్నానోదయం అవుతుందని ముందే అర్థమవతుంది. ఐతే కావాలనే అతని పాత్రను చివరిదాకా పొడిగించారు. షాయాజి పాత్ర ద్వారా కాస్త వినోదం పండిద్దామన్న ప్రయత్నం చేశారు కానీ.. అదేం ఫలితాన్నివ్వలేదు. ప్రథమార్ధం సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ కు ముందొచ్చే శ్రీరామనవమి-ఉరుసు సన్నివేశం బావుంది. క్లైమాక్స్ లో నాగ్ ను చూస్తే అన్నమయ్య గుర్తొస్తుంది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. రాఘవేంద్రరావు తన ప్రత్యేకత అంతా ఇక్కడే చూపారు. ఐతే అంతకుముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని తగ్గిస్తాయి. బాలసాయిగా చేసిన కుర్రాడు ఆకట్టుకోలేదు. నటీనటుల మేకప్ విషయంలో శ్రద్ధ వహించలేదు. బాలసాయి పెద్దవాడై తిరిగి వచ్చే సమయానికి ముసలావిడ మేకప్ మార్చారు కానీ.. శరత్ బాబు మాత్రం అంతకు ముందులాగే ఉంటాడు. కమలిని కూడా తొలి సన్నివేశంలో ఓ మేకప్ తో ఉంటుంది.. తర్వాతి సన్నివేశంలో మరోలా ఉంటుంది. ఇవి చిన్న విషయాలే కావచ్చు. వీటిని పట్టించుకోకుంటే ప్రేక్షకుడు సినిమాలో లీనం కాలేడు.
రాఘవేంద్రరావు మునుపటి స్థాయిలో మాయ చేయలేకపోయారు కానీ ఉన్న పరిమితుల్లోనే ‘శిరిడి సాయి’ని బాగానే తీశారు. కొన్పి సన్నివేశాల్లో ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. పాటల చిత్రీకరణ.. అందులోనూ మొదటి పాట ‘ఒక్కడే దేవుడు’ పాట చిత్రీకరణ బాగుంది. ఖర్చుకు వెనుకాడకుండా మంచి ప్రయత్నం చేసిన నిర్మాత మహేష్ రెడ్డిని అభినందించాలి. సినిమాను నిలబెట్టడానికి కీరవాణి శాయశక్తులా ప్రయత్నించారు. ఆయన సంగీతమే సినిమాకు ప్రధాన ఆకర్షణ. స్కోర్ తీసి చూస్తే.. సన్నివేశాలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కడే దేవుడు, నీ పాదముల.. పాటలు ఆకట్టుకుంటాయి. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ తీసి చూస్తే.. సన్నివేశాలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కడే దేవుడు, నీ పాదముల.. పాటలు బాగా ఆకట్టుకుంటాయి. పరుచూరి బ్రదర్స్ మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. నువ్వు తినడం ప్రకృతి, పక్కవాడిది దోచుకు తినడం వికృతి, నువ్వు తింటూ పక్కవాడికి పెట్టడం సంస్కృతి.. అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి డైలాగులు మరికొన్ని ఉన్నాయి.
అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రల్లో ఒదిగిపోయిన నాగార్జున సాయి పాత్రలోనూ ఆకట్టుకున్నారు.ఆరంభంలో సాయి పాత్రలో నాగ్ ను చూడగానే మామూలుగా అనిపిస్తారు. సినిమా సాగే కొద్దీ పరిణతి కనిపిస్తుంది. సన్నివేశాలు సాగే కొద్దీ సాయి దేవుడిలా మారుతున్న భావన కలిగిస్తాడు నాగ్. పతాక సన్నివేశంలో మళ్లీ అన్నమయ్య, శ్రీరామదాసులను గుర్తుకు తెచ్చారు. ఐతే కొన్నిచోట్ల ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు సూటవలేదు. పతాక సన్నివేశంలో, మరికొన్ని సన్నివేశాల్లో చక్కగా అభినయించిన నాగ్.. కొన్నిచోట్ల మాత్రం ఇబ్బందిగా కనిపించారు. పాత్ర హావభావాల విషయంలో యూనిఫార్మిటీ మెయింటైన్ చేయలేకపోయారు. బహుశా దర్శకుడి సూచన మేరకు అలా చేశారేమో. మూడు రోజుల పాటు తాను పైలోకానికి వెళ్లొస్తానని చెప్పే సన్నివేశంలో నాగ్ నటన అంతగా ఆకట్టుకోలేదు. అన్నీ తెలిసిన దేవుడు.. అంత ఉద్వేగానికి ఎందుకు గురవుతాడో అర్థం కాదు. పరిణతితో కనిపించాల్సిన సాయి పాత్ర అంత ఉద్వేగానికి లోనవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐతే ఓవరాల్ గా నాగ్ సాయిబాబా పాత్రలో మెప్పించారు. దాసుగణంగా శ్రీకాంత్, నానావతిగా సాయికుమార్, సుందరీబాయిగా కమలిని, సెహన్ షాగా శరత్ బాబు ఆకట్టుకున్నారు.
మొత్తంగా చూస్తే శిరిడి సాయి నిరాశ పరచదు. ఈ కాలంలో ఇలాంటి సినిమాలు రావడం గొప్ప విషయం. రొటీన్ మాస్ సినిమాల మధ్య ‘శిరిడి సాయి’ ఉపశమనాన్నిచ్చేదే. ఐతే అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల రోజులు వేరు. లాంగ్ రన్ లో సినిమాలు నిలబడ్డాయి. కానీ ఇప్పుడంతా ఒకట్రెండు వారాల్లో తేలిపోయే వ్యవహారం. కాబట్టి పోటీని తట్టుకుని ‘షిరిడి సాయి’ నిలబడుతుందా లేదో చూడాలి........
No comments:
Post a Comment