రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్, శ్రీనువైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, బోయపాటి శ్రీను… మనకు ఈ తరంలో చెప్పుకోదగ్గ పెద్ద డైరెక్టర్లు వీళ్లు. వీరిలో పూరి జగన్నాథ్ వైపు, మిగతా వాళ్లంతా ఒకవైపు. మిగతా వాళ్లకు హిట్లూ ఉన్నాయి. ఫ్లాపులూ ఉన్నాయి (రాజమౌళి మినహాయింపు). కానీ మిగతా వాళ్ల సినిమాలు ఫ్లాపైనా పర్లేదనిపిస్తాయి. ఎంతో కొంత ప్రయత్నముంటుంది. చెప్పుకోదగ్గ విషయముంటుంది. కానీ వాళ్లెవరూ పూరి జగన్నాథ్ లా ‘పరమ చెత్త’ సినిమాలు మాత్రం తీయరు. ఒక ‘బాచి, ఒక ‘ఆంధ్రావాలా’.. ఒక ‘నేను నా రాక్షసి’.. ఇలాంటి చెత్త చిత్రాల్ని అందించిన ఘనత పూరిది. ఇప్పుడు వాటన్నింటినీ మించిన చిత్ర రాజం వచ్చింది. దాని పేరు ‘దేవుడు చేసిన మనుషులు’. దేవుడున్నాడని నమ్మి సినిమా చూడమన్నాడు పూరి. అతణ్ని నమ్మి సినిమా చూసిన వారికి మాత్రం నరకమే.
తమిళంలో పదేళ్లకు ముందు ఓ సినిమా వచ్చింది. ‘12 బి’ అని. చాలా చిత్రమైన కాన్సెప్టు. చాలా కొత్త స్క్రీన్ ప్లే. ప్రారంభ సన్నివేశంలో హీరో ఇంటర్వ్యూకు వెళ్లేందుకు బస్సెక్కబోతాడు. అది మిస్సవుతుంది. చాలా నిరాశ చెందుతాడు. అప్పుడు దర్శకుడి వాయిస్ ఓవర్.. ఇంతకీ అతను ఆ బస్సు అందుకుంటే అతని జీవితం ఎలా ఉంటుందో చూద్దామా.. అంటాడు. అక్కడి నుంచి మనకు రెండు రకాల సన్నివేశాలు కనిపిస్తాయి. బస్సు ఎక్కకుంటే హీరో జీవితం ఎలా ఉండేది.. ఎక్కితే ఎలా ఉండేది.. అన్నది మార్చి మార్చి సన్నివేశాల ద్వారా చూపిస్తాడు దర్శకుడు. చాలా గమ్మత్తైన ముగింపుంటుంది సినిమాలో. సినిమాటోగ్రాఫర్ జీవా (ఈ మధ్యే గుండెపోటుతో చనిపోయాడు) దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. మంచి ప్రయోగంగా ప్రశంసలందుకుంది. కోలీవుడ్ లో ఓ క్లాసిక్ గా మిగిలింది. మన పూరి ఈ కాన్సెప్టునే కాపీ కొట్టి ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా తీశాడు.
ముందుగా పూరి తయారు చేసిన ఒక ‘తొక్కలో కథ’ గురించి తెలుసుకుందాం. పైన వైకుంఠంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల (బ్రహ్మానందం, కోవై సరళ) మధ్య సంభాషణతో మొదలవుతుంది సినిమా. లక్ష్మీదేవి ఏదైనా కథ చెప్పమంటుంది. అప్పుడు హైదరాబాద్ లో సెటిల్మెంట్లు చేసే రవితేజ (పాత్రలన్నింటికీ అవే పేర్లు పెట్టారు), బ్యాంకాక్ లో టాక్సీ నడుపుకునే ఇలియానా (ఇలియానా)ల మధ్య ప్రేమకథ గురించి చెబుతాడు విష్ణుమూర్తి. ఓ వ్యక్తి అరటి తొక్క వేయడం వల్ల రకరకాల పరిణామాలు జరిగి.. మాఫియా డాన్ ప్రకాష్ రాజ్ (ప్రకాష్ రాజ్), సీఐ సుబ్బరాజు (ప్రకాష్ రాజ్)లకు గొడవ మొదలవుతుంది. వీళ్ల గొడవను సెటిల్ చేసే పని మీద బ్యాంకాక్ కు వెళ్తాడు రవితేజ. అక్కడ ఇలియానాతో ప్రేమలో పడతాడు. కథ ఓ కంచికి చేరుతుండగా ఇద్దరికీ గొడవవుతుంది. అప్పుడు ఇంటర్వెల్. ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు. అతనా అరటి తొక్క వేయకుంటే ఏం జరిగేదో చూద్దామని ఇంకో కథ చూపిస్వితాడు. మళ్లీ సెకండాఫ్ లో సేమ్ క్యారెక్టర్లతో ఇంకో సినిమా మొదలవుతుంది. ఏదోలా ముగుస్తుంది.
ఆడియో ఫంక్షన్లో కథ లేకుండా తీసిన సినిమా ఇది అన్న పూరి మాటలు నిజమే. బుర్ర బద్దలు కొట్టుకున్నా ఇందులో కథ అన్నది ఒకటుందని ఏ కోశానా అనిపించలేదు. కాన్సెప్టు వరకు కాపీ కొట్టిన పూరి.. సినిమా మొత్తం నానా చెత్తతో నింపేశాడు. ముందు విష్ణుమూర్తితో ‘ప్రేమకథ’ అనిపించడమే పెద్ద జోక్. చూపించడం రెండు ప్రేమకథలైతే చూపించారు కానీ.. రెండిట్లోనూ ఎక్కడా ప్రేమ కనిపించదు. రెండు భాగాల్లోనూ హీరో లేదా హీరోయిన్ ప్రేమలో పడటానికి ఒకటే కారణం.. ఇద్దరూ అనాథలవడం అంతే. అసలు ఎవడో బఫూన్ గాడు సీఐ గన్నుకు ఫుట్ బాల్ తగలడం వల్ల చనిపోవడమేంటో.. పోయాడు పో! మాఫియా డాన్ సీఐపైన పగపట్టడమేంటో.. పట్టాడుపో! అతణ్నుంచి తప్పించుకోవడానికి సీఐ.. చిన్నచిన్న సెటిల్మెంట్లు చేసే హీరోను మధ్యవర్తిగా ఎంచుకోవడమేంటో.. అంతా పూరియేచ్ఛ. తోచింది రాసేయడం.. తీసి జనాల మీదికి వదిలేయడం.. ఒక దశా దిశా అంటూ ఏం లేదు. సినిమా మొత్తంలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి సన్నివేశం ఉంటే ఒట్టు. విచారకరమైన విషయమేంటంటే.. గతంలో పూరి తీసిన ఫ్లాపుల్లోనూ చెప్పుకోవడానికి కొన్ని పంచ్ డైలాగులైనా ఉండేవి. ఇందులో అవీ కరవే. పూరి అన్నివిభాగాల్లోనూ ఫెయిలే. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూశాక.. పిచ్చి అతనికా లేక పూరికా అన్న అనుమానం రాకమానదు. ఎంత పిచ్చయినా సడెన్ గా ఇలియానాను చూసి.. నా చెల్లి నా చెల్లి అనడమేంటో. ఆమె కూడా అన్నయ్యా అన్నయ్యా అంటూ పిచ్చెక్కి పోవడమేంటో. ఈ హింస చాలదన్నట్లు చివర్లో ట్విస్టుల మీద ట్విస్టులు. సినిమా ముగిసిందనుకుంటే ఓ పాట. సర్లే ఇంకా సినిమా ఉందేమో అనుకుని కుర్చీల్లోనే కూర్చుంటే సడెన్ గా పక్కన టైటిల్స్. అప్పటికి గానీ అర్థం కాదు.. పూరికి పిచ్చి ఎంత ముదిరిందో! గతంలో సింగిల్ని లైన్ స్టోరీలకు తనదైన మార్కు కథనం జోడించి హిట్లు చూసిన పూరి.. ఇప్పుడా మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నాడు. పూజలు చేయడం కాదు.. కష్టపడాలి అని నీతి చెప్పిన పూరి, తాను మాత్రం కష్టపడటం మరిచిపోతున్నామో అనిపిస్తోంది ఈ మధ్య అతని సినిమాలు చూస్తుంటే.
ఇక పూరి చేసిన క్యారెక్టర్ల గురించి ఏం మాట్లాడతాం. రవితేజ చేయడానికి ఏముందక్కడ? అతని నటన పరమ రొటీన్. షూటింగ్ సమయంలోనే సంగతి అర్థమైనట్లుంది రవితేజకు. తన ఆహార్యం, మేకప్ మీద ఏమాత్రం దృష్టిపెట్టలేదు. అతను ముదిరిపోతున్న సంగతి స్పష్టంగా తెలిసిపోతోంది. రవితేజ ఇకనైనా తన పంథా మార్చుకుంటే మేలు. డైరెక్టర్లను గుడ్డిగా నమ్మి ఎన్నాళ్లిలాంటి క్యారెక్టర్లు చేస్తాడు? వరుసగా ఫ్లాపులు చూస్తున్న తరుణంలో ఇలాంటి తలాతోకా లేని సినిమాలు ఎంచుకుంటాడా? బహుశా తనకు లైఫ్ ఇచ్చాడన్న కృతజ్నతతో పూరికి ఓకే చెప్పాడేమో అతను. ఇకపై ఇలాంటి రిస్కులు తగ్గించుకుంటే మేలు. ఇలియానా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమేలు. ఈ సినిమాలో కనిపించినంత చండాలంగా ఆమె మరే సినిమాలోనూ లేదు. అసలే బక్కచిక్కి, ముఖంలో గ్లో పోయి చూడలేటన్లు తయారైన ఇలియానా.. ఈ సినిమాలో వేసిన మేకప్ తో మరింత ఘోరంగా తయారైంది. అర్జెంటుగా ఆమె కాస్త కండ పట్టడమో లేకుంటే సినిమాలు మానుకోవడమో చేస్తే మేలు. ఆమె నటన గురించి మాట్లాడుకోవడం వృథా. ప్రకాష్ రాజ్ చేసిన చెత్త క్యారెక్టర్లలో ఇది తప్పకుండా చోటు దక్కించుకుంటుంది. తన సినిమాను భరిస్తున్న ప్రేక్షకులకు కొంచెమైనా వినోదాన్ని అందిద్దామన్న ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కు కాస్త పిచ్చి ఆపాదించాడు పూరి. కానీ అది మరింత హింసలా తయారైంది. ఇలాంటి తిక్క విలన్లను ఎన్నిసార్లు చూడలేదు. ఆలీ కూడా నవ్వించలేకపోయాడు. ఇంకా చికాకు పెట్టాడు. బ్రహ్మానందం, కోవై సరళలు చేసిందేమీ లేదు. అసలు వాళ్లతో విష్ణుమూర్తి, లక్ష్మి పాత్రలు వేయించాలని పూరికి ఎందుకనిపించిందో. రఘు కుంచె సంగీతం కూడా సినిమాకు తగ్గట్లే పెద్ద హింసలా తయారైంది. ఒక్క ‘నువ్వేనా నువ్వేనా’ పాట మాత్రం కాస్త శ్రావ్యంగా ఉంది. మిగతావన్నీ చెవులకున్న తుప్పు వదిలిస్తాయి.
బిజినెస్ మేన్ లాగా ఎలా ఉన్నా నడిచేయడానికి ప్రతి సినిమాకూ మహేష్ బాబు దొరకడన్న సంగతి పూరి గుర్తుంచుకోవాలి. సినిమాను మూణ్నెల్లో తీస్తే ఏంటి..? ఆర్నెల్లలో తీస్తే ఏంటి..? ఏడాదికి మూణ్నాలుగు సినిమాలు తీస్తే మాత్రం ఏంటి? కావాల్సింది మంచి సినిమా. వేగంగా రీళ్లు చుట్టేసి.. నిర్మాతకు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తే సరిపోతుందా? సినిమా ఫ్లాపవడం వల్ల వచ్చే నష్టాల సంగతేంటి?
No comments:
Post a Comment