Wednesday, August 22, 2012

సినిమా ఎలా తియ్యకూడదు అనే దానికి లైబ్రరీ 'సుడిగాడు'....



'సుడిగాడు'తో తన సుడిని తిరిగి సాధించేందుకు సిద్ధమయ్యారు భీమినేని శ్రీనివాసరావు. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఎంత హడావుడి చేస్తోందో అనడానికి రాజమౌళి వినాయక్‌వంటి వారే పాజిటివ్‌గా కామెంట్‌ చేయడం విశేషం. ఇక 'సుడిగాడు' కామెడీ సినిమా అయినా, తాను మాత్రం ఎంతో సీరియస్‌గా ఈ చిత్రాన్ని రూపొందించానని భీమినేని అంటున్నారు. తన గత చిత్రాలన్నింటికంటే ఎక్కువ కష్టపడి తీసిన ఈ 'సుడిగాడు' సినిమా గురించి భీమినేని చెబుతున్న ఆసక్తికరమైన వివరాలు, విశేషాలేంటో ఓసారి చూద్దాం...!

మీ కెరీర్‌లో రీమేక్‌ చిత్రాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. మళ్ళీ సక్సెస్‌ కోసం రీమేక్‌ను ఎంచుకున్నారా?
నేను ఎప్పుడు సినిమా చేసినా మంచి కథ కోసం అన్వేషిస్తాను. ఈ క్రమంలో నా కెరీర్‌లో ఎక్కువగా రీమేక్‌లను చేయటం వల్ల రీమేక్‌ దర్శకుడన్న ఆ ట్రాక్‌ రికార్డ్‌ వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడిగా నాకు దాదాపు మూడు నాలుగేళ్ళ గ్యాప్‌ వచ్చింది. మళ్ళీ నేను దర్శకుడిగా సత్తా చాటాలంటే ఇప్పటి తరానికి తగ్గట్టుగా మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీ చెయ్యాలనుకున్నాను. అప్పుడు తమిళంలో హిట్‌ అయిన 'తమిజ పదం' చిత్రం కంటెంట్‌ బాగుందనిపించింది.

అయితే ఈ సినిమా చూసిన మన తెలుగు దర్శక నిర్మాతలెందరో రీమేక్‌ రైట్స్‌ పొందాలనుకున్నారు. ఇవివిగారు కూడా రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. అయితే అధిక రేటు వల్ల, వేరే కారణాలవల్ల వారు వెనక్కి తగ్గటం, నేను రీమేక్‌ రైట్స్‌ను గ్రాబ్‌ చేయటం జరిగింది. అయితే నేను గతంలో చేసిన రీమేక్‌ చిత్రాలకు 30 శాతం మార్పులు చేస్తే, ఈ చిత్రానికి మాత్రం 70 శాతం మార్పులు చేసి మన నేటివిటీకి తగ్గట్టు ఫ్రెష్‌గా స్క్రిప్ట్‌ సిద్ధం చేయటం జరిగింది.

దీనికోసం ఒకటిన్నర సంవత్సరం హోంవర్క్‌, రీసెర్చ్‌ చేశాను. ఇక నేను ముందు నుంచి చెపుతున్నట్టుగా ఈ సినిమా ఏ ఒక్క సినిమా సెలబ్రిటీలను కించపరిచేలా ఉండదు. కేవలం సక్సెస్‌ అయిన వంద సినిమాలలోని సన్నివేశాల పేరడీగా మాత్రమే రూపొందించటం జరిగింది. అందుకే ఒక్క టిక్కెట్‌పై వంద సినిమాలు అన్న ఉపశీర్షికను పెట్టటం జరిగింది.

ఇంతకుముందు ఇలాంటి పేరడీలు వచ్చాయి కదా! మరి వాటికీ 'సుడిగాడు'కు ఉన్న తేడా..?
గతంలో కమెడియన్స్‌ సినిమాలో ఏదో ఒక సన్నివేశంలో పేరడీ చేయడం మనం చూశాం. అయితే 'సుడిగాడు' 24 క్రాప్ట్స్‌ కలిసి చేసిన పేరడీ చిత్రం. కథ, కథనం, దర్శకత్వం, కాస్ట్యూమ్స్‌, గెటప్స్‌, రీ రికార్డింగ్‌ ఇలా అన్ని విభాగాలు విజయవంతమైన చిత్రాలను గుర్తుచేస్తూ, సినిమా చూసే ప్రేక్షకుడికి మెమొరీని రీకాల్‌ చేస్తాయి. పాటలు కూడా కథకు అడ్డుపడకుండా ఈ కథనంలో ఇన్‌వాల్వ్‌ అయి కావలసినంత కామెడీని అందిస్తాయి.

ఇప్పుడు పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎక్కువగా ప్రాధాన్యత నిస్తున్నారు. ఈ క్రమంలో ఆడియెన్స్‌కు వందశాతం వినోదం అందించాలన్న ముఖ్యోద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని కంప్లీట్‌ స్కూప్‌ మూవీగా తీయటం జరిగింది. ఆల్రెడీ ట్రైలర్‌లో చూపించిన రెండుశాతం పంచ్‌లకే మంచి రెస్పాన్స్‌ లభించింది.

సినిమాలో చూసి నవ్వుకోవాల్సింది ఇంకా 98 పర్సెంట్‌ ఉంది. ఇక ట్రైలర్‌ విడుదలైన అతి తక్కువ టైమ్‌లోనే నెట్‌లో 5 లక్షల హిట్స్‌ను సాధించింది. ప్రచార చిత్రాన్ని చూసి చాలామంది హీరోలు, దర్శక నిర్మాతలు తాము ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అంటున్నారు. వారు కూడా తమ సినిమాల పేరడీని ఎంజాయ్‌ చేయటం సంతోషించదగ్గ విషయం.

సాధారణంగా హీరోల మార్కెట్‌ రేంజ్‌ను బట్టి సినిమాల నిర్మాణం జరుగుతుంటుంది. కాని 'సుడిగాడు' విషయంలో మీరు ఆ లెక్కలను ఫాలో అయినట్లు లేదు?
నిజమే. అన్ని సినిమాలు సదరు హీరోల మార్కెట్‌ ప్రకారమే, అంతే బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. అప్పుడే నిర్మాత గెయిన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బడ్జెట్‌ ఎక్కువయితే డెఫిసిట్‌తో రిలీజ్‌ చేసుకోవాల్సి వస్తుంది. నా గత చిత్రాలన్నీ మీరన్నట్టు హీరోల మార్కెట్‌ రేంజ్‌ ప్రకారమే తీశాను. అయితే ఇప్పుడు దర్శకుడిగా నేను గ్యాప్‌ అనంతరం చేస్తోన్న సినిమా ఇది.

ఏదో దీన్నొక చిన్న సినిమాగా, మూడు - నాలుగు వారాలు ఆడేసి తీసేసేలా తీస్తే, అది నాకు ఎంతవరకు హెల్ప్‌ అవుతుంది. అందుకని కావాలని ఎక్కడా ఎక్కువ ఖర్చుపెట్టి 'సుడిగాడు'ను తీసింది లేదు. ఇందాక చెప్పుకున్నట్టు ఇది 100 సినిమాల కలబోత. అవన్నీ కూడా పెద్ద హీరోల చిత్రాలు. ఆ తరహా క్వాలిటీ మిస్‌ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో సేమ్‌ అదే లొకేషన్స్‌లో, అదే తరహా ఆహార్యంతో, ఆ సినిమాలను గుర్తుచేసేలా అన్ని సీన్స్‌ను తీయటంవల్ల ఖర్చు ఎక్కువైంది.

అయితే మంచి సినిమాకు మార్కెట్‌ ఎప్పుడూ వుంటుంది. 'మేత వేస్తేనే కదా, పాలు ఎక్కువగా పిండుకోవచ్చు'. అలాగే మేము క్వాలిటీ చిత్రాన్ని తీస్తేనే కదా, సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ట్రేడ్‌లో ఇప్పటికే మా సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించింది. కొంతవరకు మా అంచనాలను ఎచీవ్‌ చెయ్యగలిగాము.

నిజమే - కానీ కొత్తగా చిన్న సినిమాలు నిర్మించాలనుకునేవారికి భారీగా ఖర్చుచేయటం కొంత ఇబ్బందికరమైన విషయమవుతుంది కదా?
ఏదైనా మనం తీసుకునే కంటెంట్‌ను బట్టి ఉంటుంది. నా వరకు ఈ చిత్రం 'లైఫ్‌ అండ్‌ డెత్‌'. నా గత చిత్రాలన్నింటికంటే ఎంతో కష్టపడి, తపనతో ఈ సినిమాను తీశాను. చిన్న - పెద్ద అన్న విషయాన్ని పక్కన పెడితే, కంటెంట్‌కు న్యాయం చేసేలా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా సబ్జెక్ట్‌ డిమాండ్‌ చేసింది కాబట్టి ఖర్చు చేశాము. ఒకవేళ ఈ సినిమా హీరో నరేష్‌ కాకుండా వేరే హీరో అయినా అదే రేంజ్‌లో ఖర్చు అవుతుంది.

దర్శకుడిగా సినిమాల విషయంలో స్పీడ్‌ తగ్గడానికిగల కారణం?
ఎప్పుడైనా సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి సక్సెస్‌ అనేది కొలమానంగా ఉంటుంది.. నా కెరీర్‌లో వరుసగా పది హిట్స్‌ ఇచ్చాను. పవన్‌కల్యాణ్‌, వెంకటేష్‌గారి స్టార్‌లతో సూపర్‌హిట్స్‌ తీశాను. మధ్యలో బ్రేక్‌ వచ్చింది. నేను ఏదో సెకండ్‌ థాట్‌లోకి వెళ్లకుండా నా సమయం కోసం వెయిట్‌చేశాను. రజనీకాంత్‌గారు అన్నట్టు లేట్‌గా వచ్చినా - లేటెస్ట్‌గా రావాలన్న మాటను ఫాలో అయ్యాను. నన్ను నేను రీబూట్‌ చేసుకున్నాను. ప్రతి ఐదేళ్ళకు కొత్త దర్శకులు వస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అన్వయించుకుని సినిమాలు చేస్తేనే ఏ దర్శకుడైనా ఎక్కువకాలం మనగలుగుతారు. అలా ఇప్పటితరం దర్శకులకు స్పోర్టివ్‌గా, కాంపిటీటివ్‌గా సిద్దమయి ఈ సినిమాను రూపొందించటం జరిగింది.

అల్లరి నరేష్‌ కూడా ఈ సినిమా విషయంలో బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యానని అంటున్నారు. ఏవిధంగా?
బేసిక్‌గా తనకు ఈ స్క్రిప్ట్‌పై ఎంతో ఇంట్రెస్ట్‌ ఉంది. తను ఇంతకుముందు ఎన్నో స్కూప్‌లు చేశాడు. బట్‌ ఇది డిఫరెంట్‌గా ఉండాలని నాతో అంటూ ఉండేవాడు. మరో మూడేళ్ళవరకు పేరడీల వైపు వెళ్ళకుండా ఉండేలా ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా చేద్దామన్నాడు. నేను కూడా నూరుశాతం కమిట్‌మెంట్‌తో దర్శకుడు - హీరో కలిసి పనిచేస్తే ఔట్‌పుట్‌ మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుందని భావించాను. మ్యూచువల్‌గా తన సజెషన్స్‌తో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాము.

అనుకున్నట్లుగానే ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే నరేష్‌ మార్కెట్‌ రేంజ్‌ను పెంచింది. రిలీజ్‌ అనంతరం బిజినెస్‌ రేంజ్‌ డబుల్‌, త్రిబుల్‌ చేయగల కెపాసిటీ సినిమాకు ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే నా కెరీర్‌లో, నరేష్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయే చిత్రం 'సుడిగాడు'.

అసలు ఇంతకీ 'సుడిగాడు' ఇలా ఉంటుంది అనేదానికి చిన్న హింట్‌ ఇస్తారా?
మనకు ఏ సినిమా, ఏ సీన్‌ ఎలా తియ్యాలనే దానికి రిఫరెన్స్‌ ఉంది. బట్‌ సినిమాను ఎలా తియ్యకూడదు అనే దానికి రిఫరెన్స్‌ లేదు. దానికి లైబ్రరీ పెడితే 'సుడిగాడు' ఫస్ట్‌ సినిమా అవుతుంది.. 81 ఏళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో సినిమాకు గ్లామర్‌ తప్ప గ్రామర్‌ లేదు. ఇది సక్సెస్‌ ఫార్ములా అని కరెక్ట్‌గా చెప్పటానికి లేదు.

ఓ దర్శకుడు ఓ హిట్‌ సినిమా తీస్తే, ఆ తరహాలోనే తర్వాతి చిత్రాలు వస్తాయి. దాన్ని బ్రేక్‌ చేస్తూ మరో హిట్‌ వస్తే, మళ్ళీ అందరూ కొత్తగా హిట్‌ అయిన సినిమాను ఫాలో అవుతూ హిట్‌ ఫార్ములా పేరుతో సినిమాను చేస్తూ వస్తున్నారు. ఇలా రిపీటెడ్‌గా చాలా సినిమాల్లో వాటినే వాడుతూ ఉండటాన్ని 'క్లిషియా' అని ఇంగ్లీష్‌లో అంటారు. దాన్ని మార్చగలిగితే బాగుంటుంది అన్న కోణంలో 'సుడిగాడు' ఉంటుంది. సినిమాలో కాదు ఇన్‌క్లూడింగ్‌ వాటి పోస్టర్‌ డిజైన్‌తో సహా పేరడీని చేయటానికి గల కారణమిది. అయితే ఇది కామెడీ సినిమా అయినా, మేము ఎంతో సీరియస్‌ కమిట్‌మెంట్‌, కష్టపడి, అన్ని యాక్యురేట్‌గా ఉండేలా తెరకెక్కించటం జరిగింది.

క్యారెక్టరైజేషన్‌ ఎలా ఉంటాయి?
మన కమర్షియల్‌, మాస్‌ సినిమాల్లో హీరో తరహాలోనే జీరో టు హీరోగా నరేష్‌ క్యారెక్టర్‌ గ్రాఫ్‌ ఉంటుంది. సడెన్‌గా ఓ వ్యక్తికి స్టార్‌డమ్‌ వస్తే, ఆ సడెన్‌స్టార్‌ ఏం చేస్తాడనేది ఇందులో ఫన్నీగా ఉంటుంది. అలాగే సూపర్‌మేన్‌, స్పైడర్‌మేన్‌ కంటే పవర్‌ ఉన్నోడు ఈ 'సుడిగాడు'. ఇక మన చిత్రాల్లో 40 ఏళ్ళ వయస్సు దాటిన వాళ్ళు కూడా కాలేజ్‌ స్టూడెంట్స్‌గా నటిస్తుంటారు.

అందుకే ఇందులో ఎం.ఎస్‌.నారాయణ, కొండవలస, ఎల్‌.బి.శ్రీరాంలు కాలేజ్‌ స్టూడెంట్స్‌గా కన్పిస్తారు. సినిమాలో వాళ్ళెంత చిన్న వాళ్ళంటే అండర్‌ ఏజ్‌ కారణంగా వారిని 'ఏ' సర్టిఫికెట్‌ సినిమా చూడ్డానికి సెక్యూరిటీవాళ్లు అడ్డుపడతారు. ఇక సినిమాలోని మిగతా పాత్రలన్నీ ప్రేక్షకులకు తెలిసినవే. గత చిత్రాలలోని క్యారెక్టర్స్‌ గుర్తుచేసేలా ఉంటాయి.

సినిమా రిలీజ్‌ ఎప్పుడు?
ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాము. 'సుడిగాడు' రిలీజ్‌ అనంతరం నా తదుపరి సినిమా వివరాలు తెలుస్తాయి. ఆల్రెడీ కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

No comments:

Post a Comment