Wednesday, August 15, 2012

రాజకీయాల్లోకి రియల్‌స్టార్ శ్రీహరి.....

 Real Star Srihari To Politics
తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రముఖ సినీ నటుడు రియల్ స్టార్ శ్రీహరి బుధవారం చెప్పారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రం నుండి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు ఇంతకాలం రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదని, కానీ ఇప్పుడు ప్రజల్లో ఉండి సేవ చేయాలని నిర్ణయించుకున్నానని శ్రీహరి చెప్పారు. 2014లో నూరు శాతం ప్రజల మధ్య ఉండి సేవ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.

ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీలో తాను చేరతానని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనిపించని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సేవ అనేది ఎక్కడి నుండైనా చేయవచ్చునని అన్నారు. నాకున్న శక్తిలో నేను నా సంపాదనలో సగం సేవకు వినియోగిస్తుంటానని చెప్పారు. ఇప్పుడు ప్రజల్లోకి రావాలనే ఆశ కలిగిందని, అందుకే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని భావిస్తున్నానని అన్నారు.

కాగా శ్రీహరి పేరు 2009లోనూ ఓసారి తెరపైకి వచ్చింది. అయితే అప్పుడు ఎంత వేగంగా తెర పైకి ఆయన పేరు వచ్చిందో అంతే వేగంగా తెరమరుగైంది. శ్రీహరి తన కూతురు అక్షయ పేరుతో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా తన సంపాదనలో కొంత మొత్తాన్ని పేద, సాద వారి కోసం ఖర్చు పెడతారు. ఇలా సేవ చేస్తున్నందుకు ఆయనకు పలు సన్మానాలు కూడా జరిగాయి. తాజాగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి సేవ చేద్దామని నిర్ణయించుకోవడం గమనార్హం.

No comments:

Post a Comment