కొందరు దర్శకులు కళాత్మక సినిమాలు తీస్తారు.. ఇంకొందరు పక్కా కమర్షియల్ సినిమాలు తీస్తారు. వారికి కళ ముఖ్యం.. వీరికి కాసులు ముఖ్యం.. ఇంకోరకం దర్శకులుంటారు.. కళాత్మక సినిమాల్నే కమర్షియల్ వేలో తీస్తారు.. కాసులూ కురిపిస్తారు.. మిగతా ఇద్దరికన్నా ఎక్కువమంది మనసులు దోచుకునేది ఈ తరహా దర్శకులే. మణిరత్నం ఈ కోవలోకే వస్తారు. అందుకే ఆయన చాలామందికి ఆదర్శం. ఆయనలా సినిమాలు తీయాలని, ఆయన స్థాయికి చేరాలని చాలామంది ప్రయత్నించారు. ప్రయత్నిస్తున్నారు. హను రాఘవపూడి కూడా అలాంటి వాడే. ‘అందాల రాక్షసి’ సినిమా చూస్తుంటే.. చాలాసార్లు హనులో గొప్ప దర్శకుడున్నాడనిపిస్తుంది.. అతని డైలాగుల్లో చాలా డెప్త్ ఉందనిపిస్తుంది.. అతనికి మంచి టేస్టుందనిపిస్తుంది.. అతని ప్రయత్నం మెచ్చుకోదగ్గదే.. కానీ అతని సినిమా మాత్రం మెప్పించేది కాదు!
మిథున (లావణ్య), సూర్య (నవీన్ చంద్ర) గౌతమ్ (రాహుల్) అనే మూడే పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. మిథునను పిచ్చిగా ప్రేమించి తర్వాత ఆమె మనసు గెలుచుకున్న సూర్య.. అనుకోని పరిస్థితుల్లో ఆమెకు దూరమవుతాడు. మిథున.. సూర్య జ్నాపకాల్లోనే ఉండగా గౌతమ్ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. అతనూ మిథునను గాఢంగా ప్రేమిస్తాడు. పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. చివరికి ఆమెను మెప్పిస్తాడు. అంతలోనే సూర్య క్యారెక్టర్ తిరిగి కథలోకి ప్రవేశిస్తుంది. అప్పుడేం జరిగింది? చివరికి ఈ ముగ్గురి జీవితాలు ఏమయ్యాయన్నది కథ.
చాలా మామూలు కథను తన నరేషన్ తో కొత్తగా చెప్పాలని చూశాడు దర్శకుడు. దీన్నో దృశ్యకావ్యంలా మలచాలని చూశాడు. అందుకు సాంకేతిక విభాగాలన్నీ చక్కటి సహకారమందించాయి. కానీ ఏం లాభం? టేకింగ్ విషయంలో హనుకు తిరుగులేదని.. ప్రారంభ సన్నివేశాల్లో, ఏమిటో.. పాటలోనే తెలిసిపోతుంది. కానీ కంటెంట్ విషయంలోనే అతను చాలా వీక్. నరేషన్ డెడ్ స్లో. సన్నివేశాల్లో ఆసక్తి లేకుండా వాటిని ఎంత పొయెటిక్ గా తీసి ఏం లాభం? కథనంలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ లేవు.
హీరోయిన్ పెళ్లి కాదని.. ఆ పెళ్లికొడుకుతోనే పారిపోవడంతో కథ మొదలవుతుంది. ఆసక్తి ఇక్కడి వరకే. హీరోహీరోయిన్లను తీసుకెళ్లి హిల్ స్టేషన్లో పడేశాక కథ ముందుకు కదిలితే ఒట్టు. హీరోయిన్ ఎంత అందంగా ఉన్నా ఎంతసేపు ఆస్వాదించగలం. పదే పదే ఆమె ముఖాన్ని.. కాదంటే హీరో ముఖాన్ని చూడటమే సరిపోయింది. వాళ్లిద్దరి మధ్య ఒకేరకం సన్నివేశాలతో నింపేశాడు దర్శకుడు. అసలు హీరోయిన్ ప్రవర్తనే లాజిక్కి అందదు. ఆమె సూర్యపై పెంచుకున్న ప్రేమ గాఢతను దర్శకుడు చూపించలేకపోయాడు. ఆమె క్యారెక్టర్ని గీతాంజలి గిరిజ తరహాలో రొమాంటిగ్గా తీర్చిదిద్దాలన్న ధ్యాసలో పడి.. అసలు విషయాన్ని పక్కనపెట్టేశాడు. ఆ క్యారెక్టర్లో ఎమోషన్ చూపించకపోవడంతో ప్రేక్షకుడికీ ఏ ఎమోషన్ కలగదు. ఇంటర్వల్ కు ముందు బాటిళ్లతో హీరోయిన్ చిత్రాన్ని చూపించే సన్నివేశం వరకు భారంగా గడుస్తుంది. దర్శకుడు, కెమెరామన్, మ్యూజిక్ డైరెక్టర్ లు ముగ్గురూ తమ ప్రత్యేకతను చాటుకున్న ఆ సన్నివేశం ఆసక్తి రేపుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటుంది. కానీ చివరి అరగంటకు వచ్చేసరికి దర్శకుడు పూర్తిగా దారి తప్పాడు. అప్పటికే ఆసక్తి తగ్గిన ప్రేక్షకులు.. దర్శకుడి కళాత్మక నరేషన్ తో మరింత ఇబ్బంది పడతారు. కవిత్వం గొప్పగా ఉంటుంది. కానీ అర్థమయ్యేది ఎందరికి? ఆ మధ్య వచ్చిన 180 సినిమాలోనూ ఇలాగే అయింది. ఎంతసేపూ టేకింగ్ గురించే ఆలోచిస్తే ఎలా? కంటెంట్ మాటేంటి? ఓ సన్నివేశాన్ని పొయెటిక్ గా తీయాలని అనుకోవడంలో తప్పులేదు.. కానీ సినిమాలో వేగం మాటేంటి? ప్రధానంగా వినోదాన్ని ఆశించి వచ్చే మన ప్రేక్షకులకు దర్శకుడు తన భావుకతను చూపించాలని చూస్తే ఎలా? అంత స్లో నరేషన్ ను మన ప్రేక్షకుడు భరించగలడా?
దర్శకుడు హను రాఘవపూడి మీద అతని గురువు చంద్రశేఖర్ ఏలేటి కన్నా.. మణిరత్నం ప్రభావం బాగా ఉన్నట్లుంది. గీతాంజలి చూసి పిచ్చెక్కిపోయినట్లున్నాడు. తన సినిమాకు కూడా గీతాంజలి ఫ్లేవర్ తేవడానికి చాలా ప్రయత్నించాడు. హిల్ స్టేషన్ ను నేపథ్యంగా తీసుకున్నాడు. గిరిజను పోలిన లావణ్యను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆమె నటన కూడా అలాగే ఉంది. ఆ పరుగెత్తడాలు.. ఆ క్వశ్చన్ చేయడాలు చూస్తుంటే వద్దన్నా గీతాంజలి గిరిజ గుర్తొస్తుంది. టేకింగ్ విషయంలో హను మంచి మార్కులేయించుకున్నాడు. అతనిలో మంచి రచయిత ఉన్నాడు. ‘‘నా ప్రేమను చాపలా పరిస్తే భూమి సరిపోదు.. సముద్రంలోకి పంపితే నీళ్లు ఇంకిపోతాయి. గాల్లో కలిస్తే విశ్వం అంతమైపోతుంది’’… ‘‘నిజం దాచడం.. అబద్ధం చెప్పడం ఒకటేనా’’ అంటే ‘‘నిజం నిప్పులాంటిది. కాల్చేస్తుంది.. అబద్ధం అప్పులాంటిది. వెంటాడుతుంది’’… ‘‘వద్దనుకుని వెళ్లిపోవడానికి ఇది ఆస్తి కాదు. జీవితం’’.. ‘‘వాలిని చంపిన రాముడు నరకానికి వెళ్లినట్లు ఎక్కడా వినలేదు…-మరి చంపేది రాముణ్నే అయితే…-అవతారం చాలించాడనుకుందాం’’ ‘‘దేర్ ఈజ్ నో పాస్ట్ టెన్స్ ఇన్ లవ్’’.. వంటి డెప్త్ ఉన్న డైలాగులు రాశాడు. ఇక హను టేస్టేంటో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కానీ సినిమాను జనరంజకంగా తీయగలిగినప్పుడే ఏమున్నా! ప్రధాన పాత్రధారులు కొత్తవాళ్లైనా బాగానే చేశారు. లావణ్య అందంగా ఉంది. ఈ సినిమాకు సూటైంది కానీ.. రెగ్యులర్ సినిమాలకు సరిపోతుందా అన్నది సందేహమే. హీరోలు ఇద్దరిలో నవీన్ బాగా ఆకట్టుకుంటాడు. అతనికి మరిన్ని అవకాశాలు దక్కొచ్చు.
సినిమాకు ప్రధాన ఆకర్షణ సంగీతం. రెహమాన్ శిష్యుడైన రథన్ చాలా ప్లెజెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఏమిటో, మనసు పలికే పాటలు వెంటాడతాయి. నేపథ్య సంగీతం కూడా చక్కగా ఉంది. ఎక్కడికక్కడ పాటల థీమ్స్ వాడుకుని, సన్నివేశాలకు ఆకర్షణ తెచ్చాడు. సాంకేతిక నిపుణుల్లో సినిమాటోగ్రాఫర్ మురళి, ఆర్ట్ డైరెక్టర్ ల కృషిని మెచ్చుకోవాలి. వీళ్లిద్దరూ దర్శకుడి టేస్టుకు తగ్గట్లు చాలా కష్టపడ్డ విషయం ప్రతి సన్నివేశంలోనూ అర్థమవుతుంది. సినిమాలో క్లోజప్ షాట్లు ఎక్కువ. ఈ షాట్లన్నంటిలో సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు హీరోయిన్ చిత్రాన్ని చూపించే సన్నివేశంలో భేష్! హీరోయిన్ చిత్రాన్ని బీరు సీసాలతో రూపొందించడంలో, సూర్య ఇంట్లో పాత సామాన్లతో రకరకాల వస్తువుల్ని తయారు చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ కృషిని అభినందించకుండా ఉండలేం.
నిజానికి హను.. ఈ కాన్సెప్టును నిర్మాతకు ఎలా చెప్పి ఒప్పించాడన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. చాలా మామూలు కథ. నరేషన్ లోనే ఉందంతా. అయినా సాయి కొర్రపాటిని ఒప్పించాడు. రాజమౌళినీ మెప్పించాడు. మంచి సాంకేతిక నిపుణులు దొరికారు.. కోరుకున్న లొకేషన్లు దొరికాయి.. తన క్యారెక్టర్లకు సరిపడే నటులు దొరికారు.. అన్నీ దొరికాయి.. అన్నీ సమకూర్చినపుడు కాస్తంత తన అభిజాత్యాల్ని పక్కనబెట్టి.. జనాల కోణంలో కూడా ఆలోచించాలి కదా! తనకు నచ్చిందే తీస్తే ఎలా.. జనాలకు నచ్చుతుందో లేదో ఆలోచించకుంటే ఎలా? నిజానికి అందాల రాక్షసికి కొన్ని మార్పులు చేస్తే.. కొన్నిచోట్ల దర్శకుడు తన పైత్యాన్ని (తీవ్రమైన పదం.. తప్పలేదు) తగ్గించుకుని ఉంటే.. కాస్తంత కమర్షియల్ హంగులద్ది ఉంటే.. సినిమా కచ్చితంగా జనరంజకంగా తయారయ్యేది. వేరే నిర్మాతల డబ్బు గురించి అంతగా ఆలోచించి.. జాగ్రత్తగా, జనాల నాడి తెలుసుకుని సినిమాలు తీసే రాజమౌళి తాను డబ్బు పెడుతున్న సినిమా గురించి ఎందుకు ఆలోచించలేదు. సినిమాకు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? తన శిష్యుడు అనీష్ ఆవకాయ్ బిర్యానీ లాంటి డ్రై సినిమా తీస్తున్నపుడు శేఖర్ కమ్ముల సైలెంటుగా ఉండిపోయినట్లు.. అందాల రాక్షసి విషయంలో రాజమౌళి కూడా దూరంగా ఉండిపోయాడేమో!
సినిమాలో రీజనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫలానా సెట్ వేస్తున్నామంటే ఓ కారణముండాలి. ఫలానా ప్రదేశంలో ఓ సన్నివేశం తీయాలంటే ఓ కారణముండాలి. మరి అందాల రాక్షసి సినిమాకు 20 ఏళ్ల ముందునాటి నేపథ్యాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు? దీనికి సమాధానం లేదు. ఇదే కథను ఇప్పటి నేటివిటీతోనూ తీయొచ్చు. ఏ మార్పూ ఉండదు. పైగా 20 ఏళ్ల ముందునాటి నేపథ్యమంటే దర్శకుడికి చాలా క్లారిటీ ఉండాలి. పరిశీలన ఉండాలి. ప్రతి సన్నివేశంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ‘ఉదయం’ పేపర్ చదివించడం, కిల్లర్ సినిమా పోస్టర్ చూపించడం.. ఇందిరాగాంధీ కటౌట్ పెట్టడం.. పాతకాలం ఫోన్లను వాడటం బాగానే ఉంది.
మరి బ్యాగ్రౌండ్లో ఇంటర్నెట్ కేఫ్ కనిపిస్తుంటే ఏం చేస్తున్నట్లు? హీరోల డ్రెస్సింగ్ మాటేంటి? అప్పటి మనుషులకు ఈ కాలం బ్రాండెడ్ దుస్తులేస్తే ఎలా? ఈ ట్రెండుకు తగిన జీన్సులు, త్రీబైఫోర్త్ లు, కార్పొరేట్ ఆఫీస్ కలర్లు చూపిస్తే ఎలా? అసలు ప్రధాన పాత్రల సంభాషణ కూడా చాలా మోడర్న్ గా ఉంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో లాగా. నేపథ్యం విషయంలో అత్యంత ముఖ్యమైన సంభాషణల గురించి మరిచిపోతే ఎలా? దర్శకుడు ఈ సినిమా తీసే ముందు ఓసారి తమిళ సినిమా సుబ్రహ్మణ్యపురం (తెలుగులో అనంతపురం) చూడండి. అది 80ల నాటి నేపథ్యంతో తీసిన సినిమా. పాత్రల డ్రెస్సింగ్, సంభాషణ, నేపథ్య సంగీతం, వాతావరణం.. మనల్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తాయి. నిజానికి ఆ సినిమాకు ఆ నేపథ్యం తప్పనిసరి. కానీ అందాల రాక్షసిని ఎందుకు 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినట్లు?
ఫైనల్ గా ప్రేక్షకుల్ని ఇరవై ఏళ్ల కిందటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాం... అని దర్సకుడే స్వయంగా చెప్పినట్లు.. సినిమా ఓ ఇరవై ఏళ్ల క్రిందటి వచ్చి ఉంటే హిట్టై ఉండేది. క్లైమాక్స్ ని మార్చి రీషూట్ చేస్తే కొంతలో కొంత ఓకే నిలబడే అవకాశం ఉంది. మనలో ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని నియంత్రించి ఎక్కడ కామా పెట్టాలో,ఎ క్కడ పుల్ స్టాప్ పెట్టాలో స్పష్టత లేకపోతే ఇలాంటి సినిమాలే వస్తాయని మరో ప్రూవ్ చేస్తుంది.
No comments:
Post a Comment