త్రివిక్రమ్ సినిమా అనగానే అంతా ముందుగా చూసేది డైలాగుల కోసమే. అతని పంచ్ ల కోసమే. కాబట్టి జులాయిలో ముందు డైలాగుల గురించే మాట్లాడుకుందాం!
సినిమా మొదలవగానే పడుతుంది పంచ్. పొద్దునే లేవచ్చు కదరా అని తండ్రి అంటే.. ‘‘కోడి కూడా పొద్దున్నే లేస్తుంది. ఏం సాధించింది? కూరొండుకుని తినేస్తున్నాం’’ అన్నది సమాధానం.
కాసేపయ్యాక పోలీసుతో హీరో ఏదో చెబుతాడు. పోలీసు నమ్మడు.. అప్పుడు ‘‘అంతేసార్. లాజిక్కులు తీస్తే నమ్మరు. మ్యాజిక్ చేస్తేనే నమ్ముతారు. అందుకే మన దగ్గర సైంటిస్టుల కంటే బాబాలు ఫ్యామస్’ అంటాడు.
బ్రహ్మాజీని పోలీసులు ఇంటరాగేట్ చేస్తుంటారు. అతను ఇర్రిటేట్ చేస్తుంటాడు. అంతలో హీరో వస్తాడు స్టేషన్ కి. బ్రహ్మాజీ గ్యాంగుని ఉతికారేస్తాడు. ఇదేంటని అడుగుతాడు బ్రహ్మాజీ.. ‘‘అతని బైక్ పోయింది. ఫ్రస్టేషన్లో కొడుతున్నాడు’’అంటాడు. కొడితే బైక్ రాదు కదా అంటే.. ‘‘ఫ్రస్టేషన్ పోతుంది కదా’’ అన్నది సమాధానం.
విలన్ ‘‘పిడికిలి బిగిస్తే ఆ వేళ్ల మధ్య ఇసుకలా తప్పించుకుంటా’’ అంటాడు. కట్ చేస్తే మరో సీన్లో హీరో ‘‘పిడికిలి బిగిస్తే గాలి కూడా బయటికి పోనివ్వని ఉడుం పట్టు నాది’’ అంటాడు.
‘‘అమ్మాయిని దేవతలా చూసుకుంటాం బాబూ’’ అంటే.. ‘‘నైవేద్యం చూపించి, ప్రసాదాలు మీరు మింగేద్దామనా’’
‘‘నీకే ఇంత తలనొప్పి తెస్తున్నాడంటే వాడెవడో అమృతాంజనంకి అమ్మామొగుడయ్యుంటాడు’’
‘‘వాళ్లు స్టేషన్ కు టాక్సీలో వెళ్లారు. మీరు గన్ తీస్తే మేం నడుచుకుంటూ ఇంట్లోకెళ్లిపోతాం’’
‘‘అలా చేయకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రమే నాకిస్తానన్నాడు మేడం’’
‘‘దాన్ని చూడండి. కరవొచ్చిన కంట్రీకి అంబాసిడర్ లా ఎలా తయారైందో’’
ఇవి మచ్చుకు కొన్నే. ఇలాంటి డైలాగులు ‘జులాయి’ నిండా బోలెడున్నాయి. అంతకు అద్భుతమైన టైమింగ్ తో, నటనతో నవ్వించే క్యారెక్టర్లున్నాయి. త్రివిక్రమ్ పెన్ పవర్, అతనిలో సెన్సాఫ్ హ్యూమర్ ఏమైనా తగ్గాయేమో అని అనుమానాలుంటే జులాయి చూడండి! అతని క్యారెక్టర్లు మీ కడుపుతో కబడ్డీ ఆడేసుకుంటాయి. ఓ పంచ్ ను పట్టుకునే లోపే ఇంకో పంచ్.. ఒక జోక్ ను అర్థం చేసుకునే లోపే ఇంకో జోక్.. మీరు భరించలేనంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు ‘జులాయి’. ఖలేజాలో నేలవిడిచి సాము చేసిన త్రివిక్రమ్ ఈసారి నేల మీదికొచ్చాడు. అందరూ నడిచే దారిలో నడిచాడు. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లే లాజిక్కులకందని, ఓ ఫార్ములా ఎంటర్టైనర్ తీశాడు. కాకపోతే తేడా త్రివిక్రమ్ మార్కు క్యారెక్టర్లు, డైలాగులే.
రవీందర్ నారాయణ్ (అల్లు అర్జున్) వైజాగ్ కు చెందిన కుర్రాడు. తండ్రి మాటల్ని లెక్క చేయడు. ఈజీ మనీపైనే అతని గురి. పదివేలిస్తే రెండు గంటల్లో లక్ష చేసి చూపిస్తానంటాడు. బయటికొచ్చి వర్షంలో నిలుచునుండగా ఓ కారొస్తుంది. లిఫ్టడుగుతాడు. అతనెక్కింది బ్యాంకులో దొంగతనానికి వెళ్తున్న ముఠా బండిని. ఆ ముఠాకు నాయకుడు బిట్టూ (సోనూసూద్) ఆ విషయం అర్థమై తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బ్యాంకులో దొంగతనం జరుగుతుంది. తర్వాత పోలీసులు బిట్టూను పట్టేసుకుంటారు. అక్కడి నుంచి మొదలవుతుంది విలన్ కి, హీరోకి మధ్య ఫైట్. బిట్టూ తప్పించుకుంటాడు. హీరోను టార్గెట్ చేస్తాడు? అతను ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ డబ్బేమైంది? విలన్ కథ ఎలా ముగిసిందన్నది మిగిలిన కథ.
చాలా మామూలు కథ. కరెక్టుగా చెప్పాలంటే జులాయిలో కథే లేదు. క్యారెక్టర్లు కూడా వీకే. త్రివిక్రమ్ తన మ్యాజిక్ తో రెండున్నర గంటలు విరామం లేని వినోదాన్నిచ్చాడు. విలన్ బ్యాంకు రాబరీ చేయడం దగ్గరి నుంచి.. చివర్లో విలన్ని హీరో పట్టుకోవడం వరకు అన్నీ లాజిక్ కు అందని సన్నివేశాలే. కానీ లాజిక్కుల గురించి ఆలోచించే లోపే.. బ్రహ్మానందమో.. ఎమ్మెస్ నారాయణో.. లేదంటే రాజేంద్ర ప్రసాదో ఇంకా మించి పోతే అల్లు అర్జునో వస్తారు.. నవ్వించి చంపుతారు. బ్రహ్మానందంది ఇందులో కథకు అవసరం లేని, అప్రధానమైన పాత్ర. కానీ థియేటర్ నుంచి బయటికొచ్చాక మరిచిపోలేని పాత్రల్లో అదొకటి. అతని పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం.
బ్రహ్మానందం ఓ ఫెయిల్యూర్ దొంగ. అతని ‘చెయిన్ కొట్టుట’ ఎలా ఉంటుందంటే.. బైక్ పై వెనక కూర్చుని వెళ్తూ ఓ లేడీ ఛెయిన్ లాగేయబోతాడు. వెనక్కి పడతాడు. ‘‘సారీ మీ చెయిన్ కి నా చేయి తగిలింది’’ అంటాడు. అతని ‘డబ్బులు దొబ్బుట’ ఎలా ఉంటుందంటే.. బ్యాగు పట్టుకెళ్తున్న వ్యక్తి దగ్గరికెళ్లి కత్తి చూపి బెదిరిస్తాడు. అతను బ్యాగులోంచి కరాటే రాడ్స్ తీసి విన్యాసాలు చేయగానే బ్రహ్మి కత్తి ముడుస్తాడు. తర్వాత బ్రహ్మి జైలుకెళ్తాడు. ఏం చేశావని పక్కనున్న బ్రహ్మాజీ అడుగుతాడు… ‘‘ఓ తల్లి మాట నెరవేర్చినందుకు’’ అంటాడు. అదేంటి అంటే.. ‘‘బయటికెళ్తే బూచాడు పట్టుకుంటాడని తల్లి కొడుకుని బెదిరించింది. వాడు బయటికొచ్చాడు. తల్లి మాట నిజం చేయాలని వాడ్ని పట్టుకున్నాను. ఆమె నాపై కిడ్నాప్ కేసు పెట్టింది’’ అంటాడు. ఈ సన్నివేశాల్లో త్రివిక్రమ్ సెన్సాఫ్ హ్యూమర్ కి, బ్రహ్మానందం టైమింగ్ కి సలాం చేయాల్సిందే. ఎమ్మెస్ నారాయణ, రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్ లు కూడా ఇలాగే గిలిగింతలు పెడతారు. ఈ ముగ్గురూ కలిసి చేసిన సన్నివేశాలన్నీ కడుపుబ్బ నవ్వించేవే. ముఖ్యంగా విలన్ గ్యాంగ్ లో ఒకణ్ని అర్జున్ షూట్ చేసే సన్నివేశం.. హీరోయిన్న లైన్లో పెట్టడానికి ‘సెటప్’ చేసే సన్నివేశంలో కడుపు చెక్కలే. అల్లు అర్జున్ లోని ఎనర్జీని దర్శకుడు వంద శాతం వాడుకున్నాడు. బన్నీ బాడీ లాంగ్వేజ్ కి పక్కాగా సరిపోయే క్యారెక్టర్ ఇది. ఎక్కడా ఇబ్బంది పడకుండా చలాకీగా నటించాడతను. హీరోయిన్ తల్లిదండ్రులు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చిన సన్నివేశంలో అర్జున్ బాగా ఆకట్టుకుంటాడు. అతని డ్యాన్సుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇలియానా పాత్రకు ప్రాధాన్యం తక్కువైనా ఫన్నీగా ఉంది. కళ్లజోడు, పళ్ల క్లిప్ తో ఆమె క్యారెక్టర్ని మొదలెట్టిన తీరు బావుంది. హీరోయిన్ని అలా చూపించి, మంచి కామెడీ రాబట్టాడు.
కర్టెన్ వెనుక దాక్కున్నావేమ్మా బయటికి రా అంటే.. ‘‘బయటే ఉన్నాను నాన్నా’’ అంటూ హీరోయిన్ కర్టెన్ లో కలిసిపోయిన డ్రెస్సును చూపిస్తే నవ్వని ప్రేక్షకుడెవడు? డీగ్లామరస్ గా కనిపించే సన్నివేశాల్లో ఇలియానా నటన బావుంది. రాజేంద్రప్రసాద్ మొదట్లో మామూలుగా అనిపిస్తారు కానీ.. పోను పోనూ తన ప్రత్యేకత చాటుకుంటారు. సినిమా ముగిసే సరికి.. అరే భలేగా చేశారే అనిపిస్తుంది. ఆయన పాత్రను సిల్లీగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఐతే వినోదం మాయలో అంతా కొట్టుకుపోతుంది. సినిమా చివరి 40 నిమిషాల్లో రాజేంద్రప్రసాద్ అదరగొట్టారు. ఐతే ఆయనకు మేకప్ బాగా ఎక్కువవడం వల్ల సహజత్వం దెబ్బతింది.
ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కొంచెం వీక్. సెకండాఫ్ మొదట్లో కథనం కొంచెం పక్కదారి పడుతుంది. సన్నివేశాలు కొంచెం స్లోగా నడుస్తాయి. మంచి పాటలన్నీ ఫస్టాఫ్ లోనే వస్తాయి. ఐతే చివరి 40 సినిమా చకచకా, ఆసక్తికరంగా సాగిపోవడంతో ప్రేక్షకుడు సంతృప్తిగా బయటికి వస్తాడు.
దేవిశ్రీ సంగీతం సినిమా జోష్ ను పెంచడానికి ఉపయోగపడింది. ఐతే పాటల చిత్రీకరణలో త్రివిక్రమ్ తన ప్రత్యేకత చూపలేకపోయాడు. అందరిలాగే లాగించేశాడు.
వినోదం మాయలో అంతా కొట్టుకుపోయింది కానీ కథలో, కథనంలో లోపాలున్నాయి. అసలు హీరో పాత్ర చిత్రణ సరిగ్గా లేదు. ప్రారంభంలో హీరోను జులాయిగా ప్రొజెక్ట్ చెయ్యాలని చూసిన దర్శకుడు.. పావు గంటకే ట్రాక్ మార్చేశాడు. మిగతా సినిమా అంతా అతణ్నో బ్రిలియంట్ లా చూపిస్తాడు. అసలు సినిమా ద్వారా త్రివిక్రమ్ ఏం చెప్పాలనుకున్నాడన్నది కూడా అర్థం కాదు. హీరో పాత్ర చిత్రణ సరిగా లేదు. హీరో క్యారెక్టర్ ద్వారా ఈజీ మనీ అన్నది మంచిది కాదని చెప్పాలని చూశాడు. అది వర్కవుట్ కాలేదు. అతను పది వేలు తీసుకెళ్లి రెండు గంటల్లో లక్ష చేయాలని వెళ్లాడు కాబట్టే ఇంత కష్టం వచ్చిందంటాడు. కానీ హీరో చిక్కుల్లో పడింది అత్యాశ వల్ల కాదు.. అతి తెలివి వల్ల. తనకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల. విలన్ని పోలీసులకు పట్టివ్వాలనుకోవడం వల్ల. ఇందులో అతని ఉద్దేశం మంచిదే కదా! మరి చివర్లో హీరో తండ్రి అతణ్ని విలన్ తో ఎందుకు పోల్చినట్లు? రావు రమేష్ పాత్రను ట్విస్ట్ కోసం బాగానే వాడుకున్నారు కానీ.. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే, ఆ క్యారెక్టర్ ను అలా ముగించడం వల్ల సినిమాకు అర్థమే లేకుండా పోయింది. అతను విలన్ తో చేతులు కలిపినపుడు హీరోను అంత తేలిగ్గా వదిలేస్తాడా? విలన్ కు చెప్పి అతణ్ని చంపించలేడా? పైగా హీరో, తన ఫ్రెండైన ఏసీపీతో కలిసి గుట్టంతా బయటికి లాగేస్తుంటే ఊరుకుంటాడా? క్లైమాక్స్ లో త్రివిక్రమ్ సెన్సాఫ్ హ్యూమర్ కొంచెం హద్దులు దాటినట్లు అనిపిస్తుంది. అప్పటిదాకా విలన్ని చాలా వయొలెంట్ గా చూపించిన దర్శకుడు చివర్లో అతణ్ని కమెడియన్ గా మార్చేశాడు. ఆ సన్నివేశాలు నవ్వులు పంచినప్పటికీ.. విలన్ నిస్సహాయత చూస్తే అప్పటిదాకా అతనిలోని క్రూరత్వమంతా ఏమైందనిపిస్తుంది?
కానీ త్రివిక్రమ్ సరిపడా వినోదాన్నిచ్చాడు కాబట్టి ప్రేక్షకుడు ఇలాంటి తప్పులన్నింటినీ క్షమించేస్తాడు. కాబట్టి జులాయికి బాక్సాఫీసులో ఢోకా లేదు.
No comments:
Post a Comment